ఈ బ్లాగు నేను సేకరించిన పద్యాలు, పాటలు మీతో పంచుకునే వేదిక

Saturday, January 31, 2015

రామ చంద్రాయ జనక రాజజా మనోహరాయ

రామ చంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టకాయ మహిత మంగళం
కోసలేశాయ సుజన భక్తదాస పోషకాయ
వాసవాది వినుత సర్వదాయ మంగళం
చారు మేఘరూపాయ చందనాది చర్చితాయ
హార కటక శోభితాయ భూరి మంగళం
లలిత రత్న కుండలాయ తులసీ వనమాలికాయ
జలజ సదృశ దేహాయ చారు మంగళం
దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ భావజ గురువరాయ భవ్య మంగళం
పుండరీకాక్షాయ పూర్ణచంద్ర వదనాయ అండజ వాహనాయ అతుల మంగళం
రాజవిమల రూపాయ వివిధ వేదాంత వేద్య సుముఖ చిత్ప్రహృదయ తామరస నివాసాయ
రామదాసాయ మృదుల కమల వాసాయ స్వామి భద్రగిరి వరాయ సర్వమంగళం

పాపడు

కుదురుగ పాపడు గుమ్మడికాయ
విరిసిన పాపడు విఘ్నేశాయ
సాగిన పాపడు సాంబశివాయ
చెలగిన పాపడు శ్రీకృష్ణాయ
అందెల పాపడు ఆంజనేయాయ
చెంగటి పాపడు శ్రీలోలాయ
జోలిన పాపడు జో సూర్యాయ
సందిట పాపడు సహచంద్రాయ
తారుచు పాపడు తాతారాయ
బజ్జున్న పాపడు పూర్ణబ్రహ్మాయ
ఆడిన పాపడు ఆనందాయ

Friday, January 30, 2015

అవతారాలు

మా పాప మామల్లు మత్స్యావతారం
కూచున్న తాతల్లు కూర్మావతారం
వరుసైన బావల్లు వరాహావతారం
నట్టింట నాయత్త నరసింహావతారం
వాసిగల బాట్టెల్లు వామనావతారం
పరమ గురుదేవ పరశురామావతారం
రక్షించు రామయ్య రామావతారం
బంటైన బంధువులు బలభద్రావతారం
బుద్దిలో మా చిట్టి బుద్దావతారం
కలివిడిలో మా యన్న కలికావతారం
వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నాతండ్రి
చిట్టి నాకన్న శ్రీకృష్ణావతారం

Thursday, January 29, 2015

చెమ్మ చెక్క చారడేసి మొగ్గ

చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
అట్లుపోయంగా ఆరగించంగా
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగా
రత్నాల చెమ్మచెక్క రంగులేయంగా
పగడాల చెమ్మచెక్క పందిరేయంగా
పందిట్లో మా బావ పెళ్ళి చేయంగ
చూచి వద్దాం రండి సుబ్బరాయుడి పెళ్ళి(సూర్యదేవుడి పెళ్ళి)
మా వాళ్ళింట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి
తాతగారింట్లో పెళ్ళి తరలిరండి

Wednesday, January 28, 2015

ఒప్పులకుప్ప వయ్యారిభామ

ఒప్పులకుప్ప వయ్యారిభామ
మినపా పప్పు మెంతిపిండి
తాటిబెల్లం తవ్వెడు నెయ్యి
గుప్పెడు తింటే కులుకూలాడి
నడుమూ గట్టె నా మాట చిట్టీ
దూదూ పుల్ల దూరాయ్ పుల్ల
చూడాకుండ జాడాతీయి
ఊదాకుండ పుల్లాతీయి
దాగుడుమూతా దండాకోరు
పిల్లివచ్చె ఎలుకా భద్రం
ఎక్కడి దొంగలక్కడే గప్ చిప్

Tuesday, January 27, 2015

కాళ్ళాగజ్జ కంకాళమ్మ

కాళ్ళాగజ్జ కంకాళమ్మ
వేగుచుక్క వెలగమొగ్గ
మొగ్గకాదు మోదుగనీరు
నీరుకాదు నిమ్మలవాయ
వాయగాదు వాయింట కూర
కూరగాదు గుమ్మడిపండు
పండుగాదు మిరియాల పోతు
పోతుగాదు బొమ్మలశెట్టి
శెట్టిగాదు శాయమన్ను
మన్నుగాదు మంచిగంధంచెక్క
లింగులింగుమటుకు పందెములపటుకు
కాలు పండినట్లు కడకు దాచిపెట్టు

Monday, January 26, 2015

కాకీ కాకీ గువ్వల కాకీ

కాకీ కాకీ గువ్వల కాకీ
కాకీ నాకూ ఈకా ఇస్తే
ఈకా తెచ్చి దిబ్బకు ఇస్తే
దిబ్బ నాకు ఎరువు ఇచ్చె

ఎరువూ తెచ్చి చేలో వేస్తే
చేనూ నాకు గడ్డి ఇచ్చె

గడ్డి తెచ్చి ఆవుకు ఇస్తే
ఆవు నాకు పాలు ఇచ్చే

పాలు తీసుకెళ్ళి పంతులుకిస్తే
పంతులు నాకు పాఠం చెప్పె

పాఠం నేను మామకు చెప్తే
మామ నాకు పిల్లనిచ్చె

పిల్లపేరు మల్లెమొగ్గ
నాపేరు జమిందార్

Sunday, January 25, 2015

జో అచ్యుతానంద - 1

జో అచ్యుతానంద జో జో ముకుందా
రార పరమానంద రామ గోవిందా||జో||

తొలుత బ్రహ్మాండంబు తొట్టె గావించి నాలుగు వేదముల గొలుసులమరించి
బరువైన ఫణిరాజు పానుపమరించి ఆధారమనియేటి దూలములవేసి||జోజో||

తొలుత బ్రహ్మాండంబు తొట్టెగావించి కామ క్రోధములను కట్టుగావించి
సాహసమ్మనియేటి పడగ గావించి భక్తిచేతనుబట్టి పానుపమరించి||జోజో||

తొమ్మిది వాకిండ్లు దొడ్డి లోపలనూ అందులో క్రూరులగు ఆర్గురిలో సాధులైదుగురు
ముగ్గురు మూర్తులున్నారూ తెలివి దాల్పెడి వాడు దేవుడున్నాడు||జోజో||

పట్టవలె నల్గురిని పదిలంబుగాను కట్టవలె ముగ్గురిని కదలకుండగాను
ఉంచవలె ఒక్కరిని హృత్కమలమందూ వుండవలె పండువెన్నెల నిండుగానూ||జోజో||

ఈడుగా నీవూకూడుండ వలెనూ జోడుగా నీవాని జూడగా వలెనూ
మేడ మీదనున్న మేలుగనవలెనూ కోరు యాగోవిందు గురిని గనవలెనూ||జోజో||

వీధి ఒక బాటలో గీతంబుసేయ కోటలో భేరి మృదంగములు మ్రోయా
వేటలో కోడెకాండ్రు కోలలు వేయా దీటులేని ప్రభువు దొరతనముసేయా||జోజో||

ఓం కారమని యేటి ఒక తొట్టెలోని తత్త్వమసి అని యేటి వలువలంబరచి
వేడ్కతో పాపణ్ణి యేర్పాటు చేసి ఏడు భువనముల వారు ఏకమైపాడా||జోజో||