ఈ బ్లాగు నేను సేకరించిన పద్యాలు, పాటలు మీతో పంచుకునే వేదిక

Friday, February 20, 2015

జో అచ్యుతానంద -2

జో అచ్యుతానంద జో జో ముకుందా
రార పరమానంద రామ గోవిందా||జో||

నందు నింటను జేరి నయము మీరంగా
చంద్రవదనలు నీకు సేవచేయంగా
అందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దు రంగ||జోజో||

అంగజుని గన్న మాయన్న ఇటు రార
బంగారు గిన్నెలో పాలు పోసేర
దొంగ నీవని సతులు బొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార||జోజో||

అంగుగ తాళ్ళపాకన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పే నీ జోల
సంగతిగా సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదన గోపాల||జోజో||

జో అచ్యుతానంద జో జో ముకుందా
రార పరమానంద రామ గోవిందా||జో||


Thursday, February 12, 2015

సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగపూసింది
చెట్టు కదలకుండ కొమ్మ వంచండి
కొమ్మ విరగకుండ పూలు కొయ్యండి
అందులో పూలన్ని దండగుచ్చండి
దండ తీసుకెళ్ళి సీతకియ్యండి
దాచుకో సీతమ్మ రాముడంపేడు
దొడ్డిగుమ్మంలోన దొంగలున్నారు
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ
దాచుకోకుంటేను దోచుకుంటారు

Wednesday, February 11, 2015

చిలకమ్మ పెళ్ళి ( రచన - గిడుగు వేంకట సీతాపతి)

చిలకమ్మ పెళ్ళి అని చెలికత్తెలందరూ
చెట్టు సింగారించి చేరి కూర్చున్నారు
పందిట పిచుకలు సందడి చేయగా
కాకులు మూకలు బాకాలూదగా
కప్పలు బెకబెక డప్పులు కొట్టగా
కొక్కొరొకోయని కోడి కూయగా
ఝుమ్మని తుమ్మెద తంబుర మీటగా
కుహు కుహూయని కోయిల పాడగా
పిల్లతెమ్మెరలు వేణువూదగా
నెమలి సొగసుగా నాట్యం చేయగా
సాలీడిచ్చిన చాపు కట్టుకుని
పెళ్ళి కుమారుడు బింకం చూపగా
మల్లీమాలతి మాధవీలతలు
పెళ్ళి కుమారుని, పెళ్ళి కూతురుని
దీవిస్తూ తమ పూవులు రాల్చగా
మైనా గోరింక మంత్రాలు చదివెను
చిలకమ్మ మగడంత చిరునవ్వు నవ్వుతూ
చిలకమ్మ మెడకట్టె చింతాకు పుస్తె

Tuesday, February 10, 2015

చిటికెన వేలు చెల్లాయి

చిటికెన వేలు చెల్లాయి
ఉంగరం వేలు బంగారం
నడిమి వేలు నాయన్న
చూపుడు వేలు నీకేసి
బొటన వేలు బొట్టుపెట్టి
ఐదువేళ్ళు అరచెయ్యి
అరచెయ్యి అరచెయ్యి జోడించి
దేముడికి దండం పెట్టు

ఈ మధ్య మా బుడ్డోడికి rhymes పెడితే 'father finger father finger where are you' అని ఒక rhyme కనిపించిది. అది చూస్తే చెన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర విన్న ఈ పాట గుర్తువచ్చి, ఆవిడకి ఫొన్ చేసి పొద్దున్నే నిద్రలేపి మరీ ఇది రాసుకున్నాను.ఇక్కడ schools లో ఇంకా rhymes చెప్పడం మర్చిపోలేదు కానీ, మేమెప్పుడు పాఠశాలలో ఆటలు కానీ, పాటలు కానీ నేర్చుకున్న గుర్తులేదు నాకు. కనీసం ఇంకో పదేళ్ళకైనా మన వాళ్ళు engineering, medicine గోల వదిలేసి కొంచమైన అందమైన తెలుగు పాటలు నేర్పిస్తే ఎంత బాగుంటుందో.

Monday, February 9, 2015

వారములు

ఆదివారము నాడు అరటి మొలిచింది
సోమవారము నాడు సుడివేసి పెరిగినది
మంగళవారము నాడు మారాకు తొడిగినది
బుధవారము నాడు పొట్టిగెల వేసినది
గురువారము నాడు గుబురులో పెరిగినది
శుక్రవారము నాడు చూడగా పండినది
శనివారము నాడు చక చకా గెల కోసి
అందరికి పంచితిమి అరటిపండు
అమ్మాయి అబ్బాయి అరటిపండిదిగో

Sunday, February 8, 2015

అ ఆలు దిద్దుదాం

అ ఆలు దిద్దుదాం అమ్మ మాట విందాం
ఇ ఈలు దిద్దుదాం ఈశ్వరుని కొలుద్దాం
ఉ ఊలు దిద్దుదాం ఉడతలను చూద్దాం
ఎ ఏ ఐ అంటూ అందరిని పిలుద్దాం
ఒ ఓ ఔ అంటూ ఓనమాలు దిద్దుదాం
అం అః అంటూ అందరమూ ఆడుదాం
గురువుగారు చెప్పిన పాఠాలు చదువుదాం
మామగారు చెప్పిన మంచి పనులు చేద్దాం
తాతగారు చెప్పిన నీతి కధలు విందాం
అందరం కలుద్దాం ఆనందంగా ఉందాం

Saturday, February 7, 2015

మోడ్రన్ చందమామ - modern candamama

చందమామ రావే జాబిల్లి రావే
మారుతి కారులో రావే మరమరాలు తేవే
చేతక్ మీద రావే చేకోడీలు తేవే
లారీలో రావే లడ్డూలు తేవే
జిప్సీలో రావే పెప్సీని తేవే
ఆటోలో రావే అడిగినవన్నీ తేవే
అన్నీతెచ్చి మా చిన్నితల్లికియ్యవే

Friday, February 6, 2015

చెన్నపట్నం చెరకుముక్క

చెన్నపట్నం చెరకుముక్క నీకో ముక్క నాకో ముక్క
భీమునిపట్నం బిందెలజోడు నీకో జోడు నాకో జోడు
కాశీపట్నం కాసులపేరు నీకో పేరు నాకో పేరు
విశాఖపట్నం విశనికర్ర నీకో కర్ర నాకో కర్ర
కాంచీపురం పట్టుచీర నీకో చీర నాకో చీర
నక్కపల్లి లక్కపిడతలు నీకో పిడత నాకో పిడత
కొండపల్లి కొయ్యబొమ్మలు నీకో బొమ్మ నాకో బొమ్మ
నిర్మలపట్నం బొమ్మల పలకలు నీకో పలక నాకో పలక
బంగినపల్లి మామిడిపండు నీకో పండు నాకో పండు
తెస్తానుండు ఇచ్చేదాక చూస్తూ ఉండు వచ్చేదాక

Thursday, February 5, 2015

చందమామ

ఆకాశవీధిలో అంతులేకుండ అల్లిబిల్లి తిరుగు ఓ చందమామ
మా ఇంటికొకమారు మా తోటివిందు ఆరగించగరావ ఓ చందమామ
నీ రాక కోసమై నే వేచియుంటి నా తోటి ఒక మాట మాట్లాడిపోవే
పలుమారు పిలిచినా పలుకవేమయ్యా పలికితే నీ నోటి ముత్యాలు పడునా
మబ్బు మబ్బున దూరి మాయమయ్యేవు మా ఇంటికెప్పుడు మరలి వస్తావు
మా ఇంటికొస్తేను మా తోటి నీవు ఆడుకుందువుగాని అరమరికలేక

Wednesday, February 4, 2015

గుడు గుడు కుంచం

గుడు గుడు కుంచం గుండేరాగం
పావడ పట్టల పడిగేరాగం
అప్పడాల గుఱ్ఱం ఆడుకోబోతే
పేపే గుఱ్ఱం పెళ్ళికిబోతే
అన్నా అన్నా నీపెళ్ళెపుడంటా
రేపుగాక ఎల్లుండి
కత్తి గాదు బద్దా గాదు గప్ చిప్

Tuesday, February 3, 2015

వానా వానా వల్లప్ప

వానా వానా వల్లప్ప
వాకిలి తిరుగు చెల్లప్ప
కొండమీది గుండురాయి
కొక్కిరాయి కాలు విరిగె
దానికేమి మందు
వేపాకు పసుపు వెల్లుల్లిపాయ
నూనమ్మ బొట్టు
నూటొక్క సారి
పూటకొక్క తూరి

Monday, February 2, 2015

వానదేవుడా

వానల్లు కురవాలి వానదేవుడా
వరిచేలు పండాలి వానదేవుడా
నల్ల నల్ల మేఘాలు వానదేవుడా
జల్లుగా కురవాలి వానదేవుడా
చెరువంత నిండాలి వానదేవుడా
చేలన్ని పండాలి వానదేవుడా
కరువంత పొవాలి వానదేవుడా
మేలంచు పొగడాలి వానదేవుడా
మా నాన్న తేవాలి వానదేవుడా
మా అమ్మ వండాలి వానదేవుడా
మా బొజ్జ నిండాలి వానదేవుడా

Sunday, February 1, 2015

చిన్ని చిన్ని బొమ్మ

చిన్ని చిన్ని బొమ్మ చిత్రమైన బొమ్మ
అమ్మ నాకు కొని ఇచ్చిన అందమైన బొమ్మ

నావలె కాళ్ళు నన్ను బోలు కళ్ళు
నావలె ముక్కు చెవులు నాణ్యముగా ఉన్నవి

చొక్కావేసి టోపీ పెట్టి షోకు చేసినాను
పౌడరు రాసి బొట్టు పెట్టి కాటుక పెట్టినాను
గంట కొట్టిన నిదురపోవును చంటిపాప వలెను

నాతోను మాటలాడదు నా చిన్ని బొమ్మ
నాతోను మాటలాడదు నా బుజ్జి బొమ్మ
బొమ్మను విడిచి నేను ఉండలేనమ్మ ఉండలేనమ్మ